ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హస్తకళలకు ఆదరణ ఏదీ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 11, 2021, 04:06 PM

ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధురాలు, మహాత్మాగాంధీ ప్రియ శిష్యురాలై స్వర్గీయ శ్రీమతి కమలా చటోపాధ్యాయ భారతీయ చేనేత హస్తకళల పట్ల చూపిన ఆదరణ, అంకితభావాలను గుర్తుచేసుకుంటూ ప్రతి యేట డిసెంబర్ 08-14 తేదీల్లో 'అఖిల భారత హస్తకళ ల వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. చేనేత, హస్తకళల పట్ల ప్రజలకు ఆదరణ, అవగాహన, ప్రోత్సాహం, చేయూత, బహుళ ప్రచారం, కళాకారులను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను ఈ వారోత్సవాల వేదికగా నిర్వహించడం జరుగుతుంది.


భారతీయ హస్తకళల ఉత్పత్తులకు విదేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తున్న కారణంగా దాదాపు 67,000ల ఎగుమతి కేంద్రాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. హస్తకళల వారోత్సవాలలో భాగంగా మహానగరాలు, పట్టణాలు,మండల కేంద్రాల్లో హస్తకళా ప్రదర్శనలు నిర్వహించడం, నైపుణ్యం కలిగిన కళాకారుల్ని గుర్తించడం, ఉత్పత్తులను కొనడం, ఉత్సాహపరచడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు.


హస్త కళల కళాకారులలో ఉచిత నైపుణ్య శిక్షణలు, ఉత్పత్తుల మార్కెటింగ్, ఆర్థిక చేయూత, సాంకేతిక వనరుల కల్పన, కళాకారుల ఉత్పత్తులకు సరైన ధరలను కల్పించడం లాంటి చర్యలు తీసుకోవడానికి 1952లో ''అఖిల భారత హస్తకళల బోర్డు' ను ఏర్పాటు చేశారు.


అనాదిగా భారత దేశంలో అసంఘటిత హస్తకళల రంగాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ఆధునిక నైపుణ్య శిక్షణలు అందుబాటులోకి రాకపోవడం, మార్కెటింగ్ వసతులు కల్పించకపోవడం, సరైన ధరలు పలకక పోవడం, గిరాకీ లేకపోవడం లాంటి పలు సమస్యలు ఈ రంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. దేశ హస్త కళారంగంలో 7 మిలియన్ల శ్రామికులు, కళాకారులు పని చేస్తున్నారు.


ఈ హస్తకళానిపుణుల్లో 56 శాతం మహిళలు, 44 శాతం పురుషులు, అందులో 21 శాతం ఎస్సీలు, 8 శాతంఎస్టీలు , 52 శాతం ఓబీసీలు ఉన్నారు. హస్తకళల్లో చేనేత వస్త్రాలు, లెదర్, కలప, లోహాలు, బంక మట్టి, ఎముకలు, కొమ్ములు, గవ్వలు, గాజులు, శిల్పాలు, కార్పెట్లు, జరీ ఉత్పత్తులు, పెయింటింగ్ లు, నార వస్తువులు, వెదురు, కేక్ డెకరేషన్, కొవ్వొ త్తులు, పేపర్, వ్యర్థ పదార్థాలు లాంటి వస్తువుల మాద్యమంగా కళాత్మక కళాఖండాల అద్భుతాలు ఆవిష్కరించబడతాయి.


2019-20లో హస్తకళ ల ఎగుమతులు 3.35 శాతం తగాయి. గత సంవత్సరం 26,213 కోట్ల రూపాయల విలువైన హస్త కళల వ్యాపారం జరుగగా, రూ. 13,412 కోట్ల ఎగుమతులు అయ్యాయి. కోవిడ్-19 కల్లోలాన్ని అధిగమించి 2020-21లో రూ. 24,000 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ప్రపంచ హస్త కళల వ్యాపారంలో ఇండియా 1.2 శాతం మాత్రమే ఉండడం విచారకరం.


కర్ర కళలు, ఎంబ్రాయిడరీ, చేనేత, ఇమిటేషన్ ఆభరణాలు, లోహ కళా ఖండాలకు అమెరికా, యుకె, యూఏఈ, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నెదర్లాండ్ లాంటి పలు దేశాల్లో మంచి ఆదరణ ఉండటం హర్షదా యకం. దేశ విభిన్న సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం, జీవన వైవిధ్యం నెలవుగా ఉన్నందున భారతీయ హస్తకళల్లో అద్వితీయ విలక్షణత కనిపిస్తుంది.


దేశీయ మార్కెట్ లో తీవ్రమైన పోటీ, డిమాండ్ - సప్లయి వ్యత్యాసం, నాణ్యతలో విదే శీ వస్తువులతో పోటీ, ఈ-ప్రభంజనాన్ని తట్టుకోలేకపోవడం, విదేశీ ఆధునిక సాంకేతికను సత్వరమే అందిపుచ్చుకోలేక పోవడం లాంటి సమస్యలు మన హస్తకళల రంగాన్ని వెంటాడుతున్నాయి. విదేశీ యంత్ర ఉత్పత్తుల కన్న భారత హస్తకళలకు మంచి గిరాకీ ఉండడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa