ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల్లో కొందరు భక్షకులుగా మారుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆకృత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. చెన్నైకు చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ కూడా ఇలాగే క్రూరంగా వ్యవహరించాడు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతిని 40 రోజుల పాటు గదిలో బంధించాడు. పలుమార్లు ఆమెపై ఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. న్యూస్18 కథనం మేరకు.. చెన్నైలోని పళ్లికరణైకు చెందిన బాధిత యువతి గతంలో మిస్ చెన్నైపోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె తల్లి తండ్రులు విదేశాల్లో నివాసం ఉంటున్నారు. యువతికి చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఒక ప్లాట్ ఉంది. అక్కడ ఉంటూ ఆమె సామాజిక సేవ చేస్తోంది. ఒక బిల్డర్ ఆ స్ధలంలో మంచి ఇల్లు కట్టి ఇస్తానని చెప్పి ఆమెను చెప్పి మోసం చేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఈ సమయంలో ఆండ్రు కార్వెల్ అనే స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్ స్పెక్టర్ యువతికి పరిచయం అయ్యాడు. కేసు విచారణ పేరిట తరచూ యువతిని స్టేషన్ కు పిలిపించేవాడు సబ్ ఇన్ స్పెక్టర్ ఆండ్రు కార్వెల్. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న యువతి తల్లిదండ్రులు ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయువతి కొంత మానసిక కుంగుబాటుకు గురైంది. దీంతో ఆయువతి తన వ్యక్తిగత విషయాలను, సమస్యలను ఎస్సై ఆండ్రు కార్వెల్ తో పంచుకోసాగింది. తన తల్లిదండ్రులు చనిపోయారని, తన ఇంట్లో సమస్యలున్నాయని అతని వద్ద వాపోయింది. ఇదే అదునుగా భావించిన కార్వెల్ ఎలాగైనా యువతిని లోంగదీసుకోవాలని ఓ ప్లాన్ వేశాడు.
ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించాయని, త్వరలోనే వాటిని దూరం చేస్తానని ఆమెను ఓదార్చాడు. దుష్టశక్తులను తప్పించే నెపంతో అతను ఒక పాస్టర్, అతని తల్లి, సోదరిని ఆమె ఇంటికి తీసుకు వచ్చాడు. వారు రోజు ఇంట్లో పూజలు చేయసాగారు. క్రమంగా ఆమె ఇంటిలోని సహాయకులను పని మానిపించి పంపించేశారు. ప్రత్యేక పూజల పేరుతో యువతిని 40 రోజుల పాటు గదిలో బంధించారు. పూజలు ప్రారంభించిన కొద్ది రోజులకు ఎస్సై కుటుంబసభ్యులు,పాస్టర్ ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే వారందరూ వెళ్లిపోయిన తర్వాత ఎస్‌ఐ బాధితురాలిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమెకు మత్తు కలిపిన పానీయాలు ఇచ్చి బలహీన పరిచారు. ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు ఎస్సై. అలా సుమారు 40 రోజుల పాటు గదిలో నరకం చూశానని బాధితురాలు పోలీసుల ఫిర్యాదులో వాపోయింది. అయితే తెలిసిన వారి సాయంతో ఆ గది నుంచి బయటపడిన యువతి మొదట కార్వెల్ కుటుంబ సభ్యులనే కలిసింది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఎస్‌ఐతో వివాహం జరిపిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈక్రమంలో ఆమె బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు ఎస్సై లాక్కున్నాడు. ఆమె తన ఆస్తి పత్రాలు ఇవ్వమని అడగ్గా కార్వెల్ ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె పళ్లికరణై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాడ్వెల్ తనను గదిలో బంధించి అత్యాచారం చేశాడని, తన ఆస్తి పత్రాలు లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కోంది. కాగా బాధితురాలి ఫిర్యాదుతో ఎస్‌ఐ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa