భారత్ - ఆస్ట్రేలియా దేశాలు కీలక అడుగులేశాయి. ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలు తొలగిపోనున్నాయి. ఈ ఒప్పందంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 27 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం.. వచ్చే ఐదేళ్లలో 45 బిలియన్ డాలర్లకు చేరుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహాన్ తో కలసి, పీయూష్ గోయల్ ఈ ఒప్పందంపై శనివారం సంతకాలు చేశారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు దేశాల ప్రధానులు మోదీ, స్కాట్ మారిసన్ హాజరయ్యారు. ‘‘భారత్ - ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. ఆస్ట్రేలియాకు భారత్ నుంచి ఎగుమతులు గత 12 నెలల్లో ఎంతగానో పెరిగాయి. చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని గోయల్ ప్రకటించారు. చాలా స్వల్ప కాలంలోనే ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం రెండు దేశాల మధ్యనున్న విశ్వాసానికి నిదర్శనంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇది నీటి విప్లవం వంటిదని పేర్కొన్నారు. గడిచిన కొన్ని వారాల్లో భారత్-ఆస్ట్రేలియా ప్రధానులు వర్చువల్ గా కలుసుకోవడం ఇది మూడో సారి. కొత్త ఒప్పందం నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే 85 శాతం ఉత్పత్తులపై టారిఫ్ లను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది. వీటి విలువ 12.6 బిలియన్ డాలర్లు. టారిఫ్ లు తొలగిపోయే ఆస్ట్రేలియా ఉత్పత్తుల్లో గొర్రె మాంసం, వూల్, కాపర్, బొగ్గు, అల్యూమినియా, రాక్ లాబ్ స్టర్, కీలకమైన ఖనిజాలు, నాన్ ఫెర్రస్ మెటల్స్ ఉన్నాయి. ఇక భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగమతి అయ్యే వాటిల్లో 96 శాతంపై టారిఫ్ లను ఆ దేశం తొలగించనుంది. ప్రపంచంలో నేడు తెరుచుకుంటున్న అతిపెద్ద ఆర్ధిక ద్వారాలు ఇవేనంటూ ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa