ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంకలో పెట్రేగిపోతున్న ప్రజాగ్రహం: కఠిన చట్టాల అమలు

international |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 03:27 PM

శ్రీలంకలో ప్రజాజీవనం అతలాకుతలమైంది. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. గురువారం రాత్రి అధ్యక్షుడి నివాసంపైకి వేలాది మంది జనం దండెత్తివెళ్లారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధిస్తున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స ప్రకటించారు. దీంతో సైన్యానికి విశేష అధికారాలను కట్టబెట్టినట్టయ్యింది. తన బహిష్కరణకు పిలుపునిచ్చేవారిని, అనుమానితులను విచారణ లేకుండానే అరెస్టు చేసి, దీర్ఘకాలం నిర్బంధించడానికి కఠినమైన చట్టాలను అమలు చేసే అధికారాన్ని కట్టబెడుతూ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీచేశారు. స్వాతంత్రం తర్వాత శ్రీలంక మునుపెన్నడూ ఇటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొలేదు. గత ఏడు దశాబ్దాలలో ఇదే మొదటిసారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిత్యావసరాల కొరత, ధరలు పెరుగుదల, రోజుకు 14 గంటల విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటి పోగా.. ప్రజలు రోడ్లపైకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రోజు రోజుకూ ప్రజాగ్రహం ఉద్ధృతం కావడంతో అణచివేయడానికి అత్యవసర పరిస్థితిని విధిస్తూ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి రాజధాని కొలంబో సహా పశ్చిమ ప్రావిన్సుల్లో రాత్రి కర్ఫ్యూను పోలీసులు అమలు చేస్తున్నారు. అంతకుముందు పదుల సంఖ్యలో హక్కుల కార్యకర్తలు ప్లకార్డులు, చమురు దీపాలతో ప్రదర్శనగా రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ‘‘రాజపక్షలు దిగిపోవాలి’, ‘ఇక అవినీతి వద్దు.. ఇంటికి వెళ్లు గొటా’ అనే నినాదాలను ప్లకార్డులపై రాసి నిరసనలు తెలియజేశారు. అలాగే, నౌరా ఎలియా పట్టణంలో పుష్ఫ ప్రదర్శన ప్రారంభానికి వచ్చిన శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స భార్య శిరంతిని ఉద్యమకారులు అడ్డుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. దక్షిణాదిలో గాలే, మటారా, మోరట్వౌ‌ సహా ఉత్తర, మధ్య ప్రావిన్సుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి నిరసనలు తెలిపారు. దీంతో రహదారులపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa