మనవడి బారసాల కార్యక్రమానికి ఆనందంగా వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నరసన్నపేట మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన ప్రగడ కృష్ణారావు (57) భార్య తిరుపతమ్మతో కలసి ఆదివారం ఆటోలో బయలుదేరారు. ఆటో నడగాం వద్దకు వచ్చేసరికి వేగం పెంచడంతో ఆటోలో వెనకవైపు కూర్చొన్న కృష్ణారావు తుళ్లి రోడ్డు పై పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విశాఖ పట్నం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.