శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. విద్యుత్ కోతలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు వంటి అంశాలపై ఆ దేశంలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి, శ్రీలంక ప్రధాని, అధ్యక్షడి ఇళ్లను ముట్టడిస్తున్నారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సోమవారం ఆ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే తాము ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నట్లు తెలిసినప్పటికీ, లాక్డౌన్ విధించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు క్షీణించాయని చెప్పారు. ప్రస్తుత సంక్షోభం నుండి శ్రీలంకను ఎలా బయటపడేయాలనే దానిపై పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.