ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంచం తీసుకుంటూ దొరికిపోయిన కర్ణాటక ఎమ్మెల్యే

national |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 04:03 PM

కర్ణాటక రాజకీయాల్లో అవినీతి కలకలం రేపింది. అధికార యంత్రాంగంపై నిఘా ఉంచే లోకాయుక్త అధికారులు వేసిన పక్కా ప్లాన్‌తో ఓ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ముఖ్యంగా గదగ జిల్లా శిరహట్టి నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చంద్రు లమాణి తన సొంత ఆసుపత్రిలోనే లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కగా.. ఇప్పుడీ వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


సొంత ఆసుపత్రే అడ్డాగా లంచం తీసుకుంటూ..


శిరహట్టి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రు లమాణి వృత్తిరీత్యా వైద్యుడు. లక్ష్మేశ్వరలో ఆయనకు సొంత ఆసుపత్రి ఉంది. రహదారి పక్కన రక్షణ గోడ నిర్మించిన విజయ్‌ పూజార్‌ అనే గుత్తేదారు నుంచి బిల్లుల క్లియరెన్స్ కోసం ఎమ్మెల్యే ఏకంగా రూ. 11 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 5 లక్షలను తన ఆసుపత్రిలోనే ఇవ్వాలని గుత్తేదారును కోరారు.


ఆడియో కాల్‌తో దొరికిపోయిన వైనం


అయితే ఎమ్మెల్యే వేధింపులు భరించలేని విజయ్ పూజార్ లోకాయుక్త అధికారులను ఆశ్రయించారు. నగదు డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే తనతో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ను రికార్డ్ చేసి అధికారులకు అందించారు. ఈ కీలక ఆధారంతో ధార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో అధికారులు నిఘా పెట్టారు. గుత్తేదారు నగదు ఇస్తున్న సమయంలో ఆసుపత్రిపై మెరుపు దాడి చేసిన అధికారులు.. ఎమ్మెల్యేను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.


ముగ్గురు అరెస్ట్.. స్పీకర్‌కు సమాచారం


ఈ దాడిలో కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) గురు లమాణి, సహాయకుడు మంజునాథ్‌ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరి ముగ్గురిని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అరెస్ట్ కావడంతో నిబంధనల ప్రకారం కర్ణాటక విధానసభ స్పీకర్‌ యూటీ ఖాదర్‌కు అధికారులు సమాచారం అందించారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడటం బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు ఫోన్ ఆడియో ఆధారాలు, మరోవైపు నగదుతో పట్టుబడటంతో ఈ కేసులో ఎమ్మెల్యేకు ఉపశమనం లభించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa