రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా తన ఇద్దరు కుమార్తెలకు ఒకే రోజు పెళ్లి నిశ్చయించాడో తండ్రి. పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకోగా బంధువులు, స్నేహితులంతా వారింటికి చేరుకున్నారు. హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలన్నీ సందడిగా జరిపించారు. అయితే పెళ్లి రోజు మరింతగా ఎంజాయ్ చేయాలని అంతా అనుకోగా.. కాబోయే వధువులు ఇద్దరు మాత్రం విషగుళికలు మింగి మరీ ప్రాణాలు తీసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన జోధ్‌పూర్‌లోని మానాయ్ గ్రామంలో కలకలం రేపింది.
సంతోషం వెల్లివిరిసిన వేళ.. ఊహించని మలుపు
మృతులను 25 ఏళ్ల శోభ, 23 ఏళ్ల విమలగా గుర్తించారు. శనివారం రోజే వీరిద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. దీంతో శుక్రవారం రాత్రి వరకు ఇంట్లో బంధుమిత్రులతో సందడి నెలకొంది. ఆట, పాటలు హల్దీ, సంగీత్ వంటి వేడుకలు ఘనంగా జరిగాయి. కాబోయే పెళ్లి కుమార్తెలు ఇద్దరు కూడా తెగ సంబుర పడిపోతూ.. అన్ని ఫంక్షన్లను ఎంజాయ్ చేశారు. అయితే అర్ధరాత్రి వరకు అందరితో నవ్వుతూ గడిపిన వధువులు ఇద్దరూ అర్ధరాత్రి తర్వాత పడుకోవడానికి వెళ్లారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారిద్దరి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది.
సోదరీమణులిద్దరూ స్పృహ కోల్పోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని జోధ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు ఆసుపత్రికి చేరుకునే లోపే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చేతికి అందొచ్చిన ఆడబిడ్డలు, పెళ్లి పీటలు ఎక్కాల్సిన వేళ విగతజీవులుగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి.
అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు
పోలీసుల సమాచారం ప్రకారం.. ఆసుపత్రిలో మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాలను ఇంటికి తీసుకువచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. అయితే సమాచారం అందుకున్న ఏడీసీపీ (వెస్ట్) రోషన్ మీనా తన బృందంతో అక్కడికి చేరుకుని శ్మశానానికి వెళ్తున్న మృతదేహాలను అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించారు.ఇదీ చూడండి: పుత్తూరు: విజయశాంతి రెడ్డి ఘటన మరువకే ముందే.. మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
మిస్టరీగా మారిన మరణాలు
పోలీసుల ప్రాథమిక విచారణలో ఇద్దరు సోదరీమణులు ఏదో విష పదార్థం సేవించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకలేదు. "వధువులు ఇద్దరూ అర్ధరాత్రి వరకు సంతోషంగానే ఉన్నారు. అకస్మాత్తుగా వారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయి" అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మానాయ్ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సంతోషంతో ఎగిరి గంతేయాల్సిన పెళ్లి పందిరిలో ఇప్పుడు రోదనలు మిన్నంటుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa