మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన అధికారిక సమావేశాన్ని వాయిదా వేయాలని భారత్, అమెరికాలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. న్యాయపరంగా తీర్పు ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేసిన తర్వాతే చర్చలపై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 23న ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధి బృందాల మధ్య అమెరికాలో చర్చలు జరగాల్సి ఉంది. సుదీర్ఘ చర్చల అనంతరం భారత్,-అమెరికాలు వాణిజ్య ఒప్పందంపై గత నెలలో ట్రంప్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అమెరికా వస్తువులపై సున్నా శాతం, భారత్‌పై 18 శాతం సుంకాలను ఉంటాయని ఆయన తెలిపారు.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చోటుచేసుకున్న తాజా పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే వాణిజ్య ఒప్పందంపై సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినా ప్రపంచ దేశాలపై 15 శాతం సుంకాలను శనివారం ప్రకటించారు. అమెరికాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న తీర్పును సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచుతున్నట్టు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు మాత్రం ప్రతీకార సుంకాలను అత్యవసర అధికారులను వినియోగించి విధించలేరని స్పష్టం చేసింది. ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన అమెరికా సర్వోన్నత న్యాయస్థానం.. కాంగ్రెస్ ద్వారానే సుంకాలు విధించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ కిందట ట్రంప్ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని ఉద్ఘాటించింది. ఈ తీర్పుతో అమెరికా విధించిన సుంకాలు రద్దయ్యాయి. అయితే, ట్రంప్ మాత్రం న్యాయస్థానం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా అవమానకరమని, తన వద్ద ప్లాన్ బీ ఉందని గవర్నర్లతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగానే ఆయన మళ్లీ సుంకాలను ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa