భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ రికార్డు సృష్టించింది. ఏకబిగిన 7 గంటల 30 నిమిషాల పాటు ప్రయాణించి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చండీగఢ్ నుంచి అసోంలోని జొర్హాట్ కు నాన్ స్టాప్ గా ప్రయాణించింది. ఈ రికార్డు నెలకొల్పే క్రమంలో చినూక్ హెలికాప్టర్ 1,910 కిలోమీటర్లు ప్రయాణించిందని భారత వాయుసేన (ఐఏఎఫ్) వర్గాలు వెల్లడించాయి. చినూక్ హెలికాప్టర్ సామర్థ్యం, తమ అధికారులు పక్కా ప్లానింగ్ తోనే ఈ రికార్డు సాధ్యమైందని ఐఏఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ లో ఓ హెలికాప్టర్ ఎక్కడా ఆగకుండా ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయడం ఇదే ప్రథమం అని వివరించింది.
చినూక్ హెలికాప్టర్ మల్టీ రోల్ హెలికాప్టర్. సైనిక దళాల రవాణా, ఆయుధ వ్యవస్థలు, ఇంధనం తరలింపునకు సాయుధ దళాలు దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటాయి. అంతేకాదు, విపత్తుల సమయాల్లోనూ బాధితుల తరలింపు సేవల్లోనూ, సహాయ సామగ్రి రవాణాలోనూ వీటిదే ప్రముఖ పాత్ర. చినూక్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారుచేస్తోంది.