ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గురువారం సాయంత్రం విజయవాడలో జైభీమ్ భారత్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల కోసం పోరాడే పార్టీ ఒక్కటి కూడా లేదన్నారు. తాను 28ఏళ్లకే న్యాయమూర్తి అయ్యానని, పదేళ్లలో ఆ పదవిని వదిలి వచ్చానన్నారు. రూపాయికి కిలో బియ్యం, రూ.200లకు ఆయిల్ ప్యాకెట్ ఇచ్చే పార్టీలను పొగుడుదామా అని ప్రశ్నించారు.
దళితులకు సీఎం జగన్ చేసిన అన్యాయం ఎవ్వరూ మర్చిపోరన్నారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీలోని దళిత నాయకులను ఓడించేందుకే ఈ పార్టీ పెడుతున్నట్టు స్పష్టం చేశారు. 26 రకాల దళిత స్కీమ్లను జగన్ రద్దు చేశారని విమర్శించారు. విదేశీ విద్య కోసం వెళ్లే వారు ప్రభుత్వం నుంచి నిధులు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఓడిపో, ఓడించు, గెలువు అన్న కాన్షీరామ్ మాటలు తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.