నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి స్వర్గీయ పిన్నమనేని కోటేశ్వరరావు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహావిష్కరణ సభలో వెంకయ్య పాల్గొని ప్రసంగించారు. వర్ధంతులు, విగ్రహ ఆవిష్కరణలు వల్ల వాళ్లకు ఒరిగేది ఏమి ఉండదని, వారి సిద్ధాంతాలను, స్ఫూర్తి ని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. రాజకీయంగా పార్టీ మారకుండా అందరితో కలుపుకు వెళ్ళిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. ఇప్పుడున్న రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతుందన్నారు.
చట్ట సభలలో శాసన సభ్యులు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని వెంకయ్య అన్నారు. వారసత్వంతో కాదు జవసత్వాలతో రాజకీయాలలోకి రావాలని సూచించారు. కులం కన్న గుణం మిన్న అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్నికల సమయాల్లో రాజకీయపార్టీలు అమలుకాని హామీలు ఇస్తున్నాయని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోకి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ వస్తోందన్నారు. ఇది మంచిదే. దీనిపై విస్తృతమైన చర్చ జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.