ఇది నిజంగా భారతీయులకు గుడ్ న్యూసే. యూపీఐతో ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోనూ భారతీయులు చెల్లింపులు చేసుకునే అవకాశం లభించింది. యూఏఈలోని మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన ‘నియోపే’తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఒప్పందం చేసుకోవడంతో ఈ అవకాశం దక్కినట్టయింది. యూఏఈలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉంటున్న విషయం తెలిసిందే. ఇటు భారత పర్యాటకులూ ఆ దేశానికి ఎక్కువగా వెళుతుంటారు. ఈ క్రమంలోనే యూపీఐ ఆధారిత చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
దీంతో యూపీఐ ద్వారా కూడా అక్కడ చెల్లింపులు చేసేలా ఎన్పీసీఐ.. నియోపేతో ఒప్పందం చేసుకుంది. కాగా, యూఏఈలో భీమ్ యూపీఐ సేవలు రావడం తమకు సంతోషంగా ఉందని ఎన్ఐపీఎల్ సీఈవో రితేశ్ శుక్లా చెప్పారు. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఎన్ఐపీఎల్ కసరత్తులు చేస్తోందన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది భారత పర్యాటకులకు ప్రయోజనం కలగనుందని నియోపే సీఈవో విభోర్ ముంధాదా చెప్పారు.
ఇదిలావుంటే నియోపే ఉన్న షాపులు, మాల్స్ లలోనే యూపీఐ సేవలు అందనున్నాయి. ఇప్పటికే భూటాన్, నేపాల్ లో యూపీఐ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో ఇప్పుడు యూఏఈ చేరింది. త్వరలోనే సింగపూర్ లోనూ యూపీఐ సేవలను లాంచ్ చేయాలని ఎన్ఐపీఎల్ భావిస్తోంది.