ఆడదానికి మరో ఆడదే శత్రువు అనే సామెత ఉంది. తాజాగా ఓ అత్యాచారం కేసులో అది రుజువైంది. తనో పాటు ఆఫీసులో పని చేసే మహిళపై తోటి మహిళ కక్షగట్టింది. ఐదుగురు పురుషులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించింది. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీయించి బెదిరించసాగింది. ఈ దారుణం గురించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా ఓ మహిళ చేరింది. అక్కడే పని చేస్తున్న మరో మహిళ ఆమెపై కక్ష పెంచుకుంది. 2020లో ఓ రోజు ఆమెను పని చేస్తున్న హోటల్లకు పిలిపించింది. తీయగా కబుర్లు చెప్పింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించింది. దీంతో అది తాగిన బాధిత మహిళ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ తతంగాన్ని అంతా నిందితురాలైన మహిళ వీడియో తీసింది. అది చూపించి రెండేళ్లుగా నిందితులు ఆమెను బెదిరించి, అత్యాచారం చేస్తున్నారు. చివరికి విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిపై అత్యాచారం చేసిన వీరేంద్ర దహియా, హరి సింగ్, జై ప్రకాష్, సుఖ్బీర్, దేవిరామ్లతో పాటు నిందితురాలైన మరో మహిళను అరెస్టు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితురాలిపై అత్యాచారం చేయించిన మహిళపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తున్నారు.