ప్రజలకు సేవ చేయడాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక బాధ్యతగా భావిస్తున్నారని, ప్రజల జీవితాలు మెరుగుపరచాలనే చిత్తశుద్ధితో ఈ మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాల విషప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై రేపు (ఈనెల 27న) జరిగే విస్తృతస్థాయి సమావేశంలో సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు. తనలాగే తన టీమ్ కూడా ప్రజలకు సేవ చేయడం, నిత్యం అందుబాటులో ఉండటం, ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా పనిచేయాలని సీఎం కోరుకుంటున్నారని చెప్పారు.
తాడేపల్లిలోని తన కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం పార్టీలో జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల పదవులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ మూడేళ్లలో అందరూ అనుకున్నదానికంటే, మేనిఫెస్టోలో చెప్పినదాని కంటే మిన్నగా సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామ, వార్డు సచివాలయాలు, డీబీటీ సిస్టమ్ ఇలా అనేక సంస్కరణలు తీసుకువచ్చి, పారదర్శకతకు పెద్దపీట వేశారన్నారు.
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి, మరో రెండేళ్లలో వచ్చే ఎన్నికలకు వెళ్లి మరోసారి ప్రజల ఆశీస్సులు తీసుకునేందుకు సమయం మొదలైందన్నారు. ప్రజల గడప వద్దకే పాలన, సంక్షేమం అంటే ఒక్కరోజు తాయిళాలు ఇవ్వడం కాకుండా భవిష్యత్తు మార్చేవిధంగా, భావితరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా సీఎం వైయస్ జగన్ పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్షం లేనది ఉన్నట్టుగా గోబెల్స్ ప్రచారం చేస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ మంచిని కిందవరకు తీసుకెళ్లడం పార్టీకి ప్రధాన కర్తవ్యమన్నారు.