ఒంటరిగా ఇంట్లో ఉన్న వివాహితపై దుండగులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె శరీరమంతా గాయాలు చేశారు. చివరికి ఆమె ప్రాణాలు తీసి, అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత సహజమరణంగా భావించినా, పోలీసులు ఆమెపై అత్యాచారం జరిగిందని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళ (40) పొలాలకు నీరు పెట్టే పైపులను అద్దెకిస్తూ జీవనోపాధి పొందుతుంది. పదిహేనేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె భర్త బిజినెస్ పని మీద తిరుపతి వెళ్లాడు. ఇక ఆ మహిళను చూసేందుకు దగ్గరి బంధువైన యువకుడు బుధవారం వారింటికి వచ్చాడు. తలుపు తీసి చూడగానే ఆ మహిళ వివస్త్రగా ఉండడం గమనించాడు. భయపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి చూడగా ఆమె శరీరంపై గోళ్లతో రక్కిన గాయాలు ఉన్నాయి. గొంతును నులిమినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఆమె భర్తకు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.