గుంటూరు జిల్లా తాడేపల్లి ఆశ్రమం రోడ్డు లో నూతనంగా నిర్మించిన 33/11 కే. వీ సబ్ స్టేషన్ ను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను విద్యుత్ శాఖ సి. ఎం. డి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ హనుమంత రావు చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలో మొత్తం 3 సబ్ స్టేషన్ లను సుమారు రూ. 25 కోట్ల ను వెచ్చించి ఒక్కో సబ్ స్టేషన్ ను సుమారు 7 లేదా 8 కోట్ల రూపాయలతో ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని, ఈ ప్రాంతంలో రైతులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ నిర్మించడం జరిగిందని అన్నారు. మిగతా రెండు సబ్ స్టేషన్లను రెండు రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.
సబ్ స్టేషన్ నిర్మాణానికి సహకరించిన అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి, ప్రస్తుతం ప్రోత్సహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక నుండి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లోవోల్టేజీ లు గానీ పవర్ కట్ లు గానీ ఉండవని, సబ్ స్టేషన్ నిర్మాణం అనతికాలంలోనే పూర్తి చేసినందుకు విద్యుత్ శాఖ అధికారులు అందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.