ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏం మాట్లాడినా అది సంచలనం అవుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేతగా ఉన్న ఆయన ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. తాజాగా 44 బిలియన్ డాలర్లలో ట్విట్టర్ సంస్థను తన వశం చేసుకున్నాడు. అయితే ట్విట్టర్ కొనుగోలు వెనుక వ్యాపార మర్మం దాగి ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో ప్రముఖులు చేసిన ట్వీట్లు, వైరల్ అయిన వాటిని థర్డ్ పార్టీ సంస్థలు యథేచ్చగా వినియోగించుకుంటున్నాయి. వారికి ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చాడు. అలాంటివి వాడుకోవాలంటే నిర్ణీత రుసుము చెల్లించాల్సిందేనని ఆయన సంస్థ ఉద్యోగులతో చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి నిబంధనలు పొందుపర్చాలనే ఆలోచనలో మస్క్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ట్విట్టర్ ఆదాయ వనరులను పెంచేందుకు మస్క్ ఇలాంటి నిబంధనలను తెరపైకి తీసుకొస్తున్నట్లు వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాకుండా ట్విట్టర్ బోర్డు డైరెక్టర్ల జీతాలను తగ్గించనున్నట్లు ఆయన గతంలో ట్వీట్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు రుణాలు ఇచ్చే బ్యాంకర్లకు ఆయన ఈ హామీలు ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.