రంజాన్ పర్వదినం రోజున మత ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈద్ పండుగ సందర్భంగా జెండాలు, లౌడ్ స్పీకర్ల ఏర్పాటు వివాదాస్పదంగా మారి, అవి కాస్తా అల్లర్లకు దారి తీశాయి.రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. జోధ్‌పుర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ వాహనాలపై రాళ్ల వర్షం కురిసింది. ఈ ఘటనల్లో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. అల్లర్ల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించారు. అల్లర్లు మరింత వ్యాప్తి చెందకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. వివరాలివి..
ఈద్ ప్రార్థనల సందర్భంగా రాజస్థాన్ లోని జోధ్‌పుర్‌లో మంగళవారం ఘర్షణలు జరిగాయి. జోధ్ పూర్ సిటీలోని జలోరీ గేట్ వద్ద జెండాలను ఏర్పాటు చేసే విషయంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. తిరిగి..
రాత్రి జరిగిన ఘటనలకు కొనసాగింపుగా మంగళవారం ఈద్ ప్రార్థనల సమయంలోనూ జోథ్ పూర్ లో ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసు బందోబస్తు నడుమ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి కల్పించారు. కొన్ని చోట్ల మైకులు తొలగించడం తాజా అల్లర్లకు కారణమైంది. అనంతరం ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఘర్షణలపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ స్పందించారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతి భద్రతలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.