రాష్ట్రంలోని అంబులెన్స్ ల పనితీరును తప్పుపట్టిన చంద్రబాబు నాయుడు వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగంలో శ్రీరామ్ అనే బాలుడు మృతి చెందగా, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అతడి మృతదేహాన్ని తండ్రి బైక్ పై ఇంటికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి, వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.
కనికరం లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. సంగంలో ఆసుపత్రి అధికారులు అంబులెన్సు ఏర్పాటు చేయలేకపోవడంతో ఆ బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. వారం వ్యవధిలో ఇటువంటి ఘోరమైన ఘటన రెండో సారి జరిగిందని మండిపడ్డారు. పేదలపై కనీస దయ చూపకుండా సీఎం వైఎస్ పరిపాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.
బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రి బైక్ పై తీసుకెళ్లిన వీడియోను టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా పోస్ట్ చేస్తూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. 'వైసీపీ సర్కార్ తీరుతో అమానవీయ ఘటనలకు నిలయంగా రాష్ట్రం. మొన్న తిరుపతి రుయా ఘటన మరువకముందే నేడు మరో దారుణం. నెల్లూరు సంగంలో బైక్ పై బాలుడి మృతదేహం తరలించిన తండ్రి. మీరు జెండా ఊపిన వాహనాలు అస్మదీయులకు వందల కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకేనా? ప్రజలకు ఉపయోగపడాల్సిన వాహనాలు ఎక్కడకు వెళ్ళాయి? వైఎస్ జగన్' అని దేవినేని ఉమ నిలదీశారు.