ప్రస్తుతం తన ముందు ఉన్న గోల్ ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలియజేశారు. తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ఆయన గురువారం ప్రకటించారు. కాకపోతే ఈ దిశగా ఆయన తన మార్గాన్ని నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడతానని పీకే ప్రకటించారు. సాధ్యమైనంత మంది ప్రజలను తన పాదయాత్ర ద్వారా చేరుకుంటానని చెప్పారు. దీన్ని కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నంగా అభివర్ణించారు.
బీహార్ లో ఇప్పట్లో ఎన్నికలు లేవంటూ, రాజకీయ పార్టీ అన్నది ప్రస్తుతానికి తన ప్రణాళికల్లో లేదని స్పష్టం చేశారు. ‘‘నేను జీరో నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి. స్వరాజ్యం అనే ఆలోచనతో రానున్న మూడు నాలుగేళ్లలో సాధ్యమైనంత మంది ప్రజలను కలుసుకోవాలి’’ అంటూ తన భవిష్యత్ ప్రణాళికను పీకే చెప్పకుండానే చెప్పేశారు.
రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూటమి ఉండదని చెబుతూ.. ఆర్జేడీ, జేడీ యూ పార్టీలపై విమర్శలు చేశారు. గత 15 ఏళ్లలో బీహార్ కు ఒరిగిందేమీ లేదన్నారు. ‘‘ఈ రోజు ఏ రాజకీయ పార్టీని లేదా రాజకీయ వేదికను నేను ప్రకటించడం లేదు. బీహార్ ను మార్చాలనుకునే అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని అనుకుంటున్నాను’’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో తనకు ఎటువంటి వ్యక్తిగత ఘర్షణ లేదన్నారు. ఇరువురి మధ్య మంచి సంబంధాలు ఉన్నట్టు చెప్పారు. వ్యక్తిగత సంబంధాలు వేరని, కలసి పనిచేయడం, అంగీకరించడం వేర్వేరు అని ప్రకటించారు.