భారతీయ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త. రైల్వే శాఖకు చెందిన ఐఆర్ సీటీసీ రామాయణ విశేషాలన్నీ చూపించే ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్’ సర్వీస్ ను జూన్ 21 నుంచి ప్రారంభించనుంది. రామాయణ సర్క్యూట్ పేరుతో అయోధ్య నుంచి భద్రాచలం వరకు ఎన్నో క్షేత్రాలను చూపించనుంది. 18 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. ఒక్కొకరికి చార్జీ రూ.62,370. మొదటగా బుక్ చేసుకునే 100 మందికి 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు ఐఆర్ సీటీసీ ప్రకటించింది.
శ్రీరాముడి జన్మ స్థలం మొదలుకొని, వనవాసం వరకు ఆయన జీవితంలో భాగమైన ఎన్నో విశేష స్థలాలను ఈ యాత్రలో భాగంగా చూసి రావచ్చు. ఈ రైలు మొదటి రోజు ఢిల్లీ నుంచి బయల్దేరుతుంది. తొలి స్టాప్ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య. ఇది శ్రీరాముడి జన్మస్థలం. రామజన్మభూమి ఆలయం, హనుమాన్ టెంపుల్, నందిగ్రామ్ లో భరత్ మందిర్ (రాముడి సోదరుడు భరతుడికి సంబంధించినది) చూపిస్తారు.
ఆ తర్వాత బీహార్ లోని బుక్సర్ కు తీసుకెళతారు. అక్కడ మహర్షి విశ్వామిత్రుడి ఆశ్రమం చూడాలి. రామ్ రేఖ ఘాట్ వద్ద గంగా స్నానం ఆచరించొచ్చు. అక్కడి నుంచి రైలు సీతమ్మ జన్మస్థలమైన సీతామర్హికి తీసుకెళుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేపాల్ లోని జనక్ పూర్ తీసుకెళతారు.
అక్కడ రామ జానకి ఆలయాన్ని చూడొచ్చు. అక్కడి నుంచి తిరిగి సీతామర్హికి చేరుకోవాలి. అక్కడి నుంచి రైలు వారణాసి చేరుకుంటుంది. అక్కడి విశేషాలన్నీ చూపిస్తారు. అనంతరం రైలు మహారాష్ట్రలోని నాసిక్ కు చేరుకుంటుంది. నాసిక్ లోని త్రయంబకేశ్వరం ఆలయం, పంచవటి చూపిస్తారు. అక్కడి నుంచి కర్ణాటకలోని, హంపి, కిష్కిందకు రైలు వెళుతుంది. హనుమంతుడి జన్మస్థలంగా భావించే ఇక్కడ హనుమాన్ ఆలయాన్ని చూడొచ్చు. అనంతరం తమిళనాడులోని రామేశ్వరంకు పర్యాటకులు చేరుకుంటారు.
రామనాథ స్వామి దర్శనం, దనుష్కోటి చుట్టి రావచ్చు. అక్కడి నుంచి రైలు కాంచీపురం తీసుకెళుతుంది. శివ కంచి, విష్ణుకంచి, కామాక్షి అమ్మవారి ఆలయాల దర్శనం చేసుకోవచ్చు. చివరిగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం క్షేత్ర దర్శనం ఉంటుంది. కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్ కు రైలు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రాచలం దర్శనం చేసుకుని రావాలి. రైలు తిరిగి ప్రయాణికులను ఢిల్లీ తీసుకెళుతుంది. రైలులో తాజాగా ఆహార పదార్థాలు వండి వడ్డించేందుకు ప్యాంట్రీ కార్, సీసీటీవీ కెమెరా, ఇన్ఫోటెయిన్ మెంట్ సిస్టమ్, సెక్యూరిటీ గార్డ్ తదితర ఏర్పాట్లు ఉంటాయని ఐఆర్ సీటీసీ ప్రకటించింది.