భారత్ లో పాకిస్థాన్ తలపెట్టిన భారీ కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా బుల్లెట్లు, గన్‌పౌడర్ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదుల నుండి ఆదేశాలు అందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాక్ ఉగ్రవాదులు చెప్పిన విధంగా నిందితులు తెలంగాణలోని ఆదిలాబాద్ కు మందుగుండు సామగ్రిని తరలిస్తున్నారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మిందర్, భూపిందర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గుర్‌ప్రీత్‌కు ఫిరోజ్‌పుర్ జిల్లాలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు అందాయి. వీరు నాందేడ్‌కు పేలుడు పదార్థాలను తరలించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు.
నిందితుల్లో ముగ్గరు ఫిరోజ్‌పుర్ కు, మరొకరు లుథియానాకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఒక పిస్టల్, 31 లైవ్ క్యాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలతో కూడిన 3 కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఈ ఘటనపై హరియాణా సీఎం స్పందించారు. నిందితులు హరియాణా మీదుగా పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.