ఆ యువతి కష్టపడి చదివి, ఎస్ఐ కొలువు సాధించింది. పెద్దలు కూడా మంచి సంబంధం చూసి, ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. నిశ్చితార్థం అయ్యాక అతడు ఫ్రాడ్ అని తేలింది. ఈ క్రమంలో బాధితుల పక్షాన నిలిచిన ఆ ఎస్ఐ తనకు కాబోయే భర్త చేతులకు బేడీలు వేసింది. అతడికి కటకటాల వెనక్కు పంపింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
అస్సాంలోని నాగాన్ జిల్లాకు చెందిన రాణా పొగాగ్ అనే వ్యక్తికి నాగాన్ జిల్లా కేంద్రంలో ఎస్సైగా పనిచేస్తున్న జున్మోనితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో తాను ప్రముఖ సంస్థలో పీఆర్‌ఓగా చేస్తున్నానని అందరినీ నమ్మబలికాడు. అయితే అతడు పలువురికి ఓఎన్‌జీసీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు అతడిని నిలదీశారు. చివరికి అతడి చేతిలో తాము మోసపోయామని తెలుసుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడు తనకు కాబోయే భర్త అని తెలుసుకున్న జున్మోని లోతుగా విచారణ చేపట్టింది. దీంతో అతడు మోసగాడని తేలడంతో వెంటనే గురువారం వెళ్లి అతడిని అరెస్టు చేసింది. విధి నిర్వహణలో ఆమె పక్షపాతం వ్యవహరించకుండా, నిక్కచ్చిగా విధులు నిర్వహించిందని ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.