విశాఖపట్నానికి పరిపాలన రాజధాని రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న చంద్రబాబు.. చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చి కపట ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. గురువారం విజయనగరం కలెక్టరేట్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకమూ పేదలకు అందలేదన్నారు. ‘తెలుగుదేశం పార్టీకి బాధలే బాధలు’ అని చంద్రబాబు చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు డాక్టర్ సురేష్‌బాబు, రఘురాజు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు.