ఐపీఎల్ 2022 సీజన్ కు దూరమైన వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్.. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ తో తిరిగి అడుగు పెడతానని ప్రకటించాడు. ఐపీఎల్ లో గేల్ కు మంచి రికార్డే ఉంది. కోల్ కతా, పంజాబ్, బెంగళూరు జట్లకు అతడు సేవలు అందించాడు. తన కెరీర్ లో ఐపీఎల్ కు దూరంగా ఉన్నది ఈ ఏడాది మాత్రమే. దీనిపై అతడు స్పందించాడు.
ఎన్నో ఏళ్లపాటు విలువైన సేవలు అందించినా, తనకు సరైన గౌరవం లభించకపోవడం వల్లే దూరంగా ఉన్నట్టు చెప్పాడు. 2009లో గేల్ ను కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది, రెండు సీజన్లలో అతడు 463 పరుగులు సాధించి పెట్టాడు. 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరిన అతడు 84 ఇన్నింగ్స్ ల్లో 3,163 పరుగులు సాధించాడు. ఐదు సెంచరీలు, 19 అర్ధ సెంచరీల రికార్డులు నమోదు చేశాడు. 2018లో పంజాబ్ కింగ్స్ అతడ్ని తీసుకుంది. 41 మ్యాచ్ ల్లో 1339 పరుగులు సాధించాడు.
‘‘వచ్చే ఏడాది నేను తిరిగొస్తా. వారికి నా అవసరం ఉంది. నేను ఐపీఎల్ లో కోల్ కతా, ఆర్సీబీ, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాను. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఎవరికి టైటిల్ వచ్చినా నేను సంతోషిస్తా. ఆర్సీబీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ ఎంతో రాణించాను. పంజాబ్ జట్టు కూడా మంచిదే. సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గేల్ ప్రకటించాడు.