శక్తిని పండి పనిచేయించుకొంటే ఫలితం శూన్యం. కానీ అదే వారి సౌలభ్యంగా ఉండే రీతిలో పనితీసుకొంటే ఫలితాలు అదుర్స్ అంటోంది ఓ కంపెనీ యాజమాన్యం. ఆఫీసుకు వచ్చింది మొదలు ఫెవిక్విక్ వేసుకుని కుర్చీలకు అతుక్కుపోయినట్టు పనిచేస్తే ఉత్పాదకత పెరుగుతుందా? ఎంతమాత్రమూ కాదని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చిచెప్పాయి. మరి ప్రొడక్టివిటీ పెంచడం ఎలా? ఈ ప్రశ్నకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘వేక్‌ఫిట్’ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. సోఫాలు, పరుపులు తయారు చేసే ఈ సంస్థ ఇటీవల కోరమంగళ ప్రాంతంలో కార్యాలయాన్ని ప్రారంభించింది. పనిచేసి అలసిపోయిన ఉద్యోగుల నుంచి మరింత ప్రొడక్టివిటీని రాబట్టేందుకు ‘న్యాప్ టైం అవర్’ను తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా ఉద్యోగులు ప్రతి రోజూ మధ్యాహ్నం అరగంటపాటు ఆఫీసులోనే నిద్రపోవచ్చు. ఇలా కునుకుతీయడం వల్ల పని ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆందోళన దూరమవుతుంది. ఆ తర్వాత మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని సంస్థ పేర్కొంది.
ఈ సందర్భంగా ‘వేక్‌ఫిట్’ సహ వ్యవస్థాపకుడైన చైతన్య రామలింగ గౌడ మాట్లాడుతూ.. నిద్రకు సంబంధించిన వ్యాపారంలో తాము ఆరేళ్లుగా కొనసాగుతున్నట్టు చెప్పారు. తమ సంస్థ ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులతో మాట్లాడి నిద్ర సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. పని మధ్యలో 26 నిమిషాల పాటు కునుకు తీస్తే పనితీరు 33 శాతం మెరుగుపడుతుందని ‘నాసా’ అధ్యయనంలో తేలిందని, హార్వర్డ్ అధ్యయనం కూడా ఇదే చెబుతోందని అన్నారు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 మధ్య అధికారికంగా ‘న్యాప్ టైం’ ఇవ్వాలని నిర్ణయించినట్టు చైతన్య తెలిపారు. ఇందుకోసం కార్యాలయంలో న్యాప్ ప్యాడ్స్, ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.