ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు. తనకు ఆస్తి పంచి ఇవ్వలేదన్న ఆక్రోశంతో కొడుకు కన్నతల్లినే కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్ మండలం వాయిల్‌కుంట పంచాయతీ పరిధి గండికుంటతండాకు చెందిన సబావట్ కమిలి(40) భర్త అయిదేళ్ల కిందట చనిపోయాడు. ఉన్న 33 గుంటల పొలాన్ని సాగుచేస్తూ ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషిస్తోంది. ఇటీవల పెద్ద కుమారుడు సంతోష్‌కు వివాహమైంది.
కమిలి పేరిట ఉన్న భూమి 33 గుంటల భూమి నుంచి 12 గుంటలను తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని పెద్ద కుమారుడు సంతోష్ తరచూ గొడవ పడుతున్నా ఆమె అంగీకరించలేదు. కోడలు ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారాన్ని కమిలి తాకట్టు పెట్టింది. నెలలు గడుస్తున్నా బంగారాన్ని విడిపించుకురాకపోవటంతో సంతోష్ తల్లితో గొడవ పడుతున్నాడు. దీంతో కమిలి కొంతకాలంగా కూలీ పనులు చేసుకుంటూ హైదరాబాద్‌లోనే ఉంటోంది. సోమవారం గండికుంటతండాలో ఓ శుభకార్యానికి వచ్చిన కమిలితో సంతోష్ మరోసారి గొడవపడ్డాడు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో తల్లిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. నిందితుడు సంతోష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.