నవమాసాలు మోసి కనకపోయినా, అంతకంటే ఎక్కువ ప్రేమతో ఆమె పెంచి పెద్ద చేసింది. అయితే ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కోసం పెంచిన పాశాన్ని సైతం అతడు మర్చిపోయాడు. పెంచి పెద్ద చేసిన తల్లిని స్నేహితుడితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆపై అడవికి పారిపోయిన అతడు కొన్ని గంటల్లోనే కిరాతకంగా హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో జంగయ్య యాదవ్, భూదేవి (58) దంపతులు నివాసం ఉంటున్నారు. జంగయ్య యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. వారికి పిల్లలు లేరు. దీంతో 1995లో బంధువుల బిడ్డను తెంచుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. అతడికి సాయి తేజ(27) అనే పేరు పెట్టి చాలా గారాబంగా పెంచారు. అయితే అతడికి మతిస్థిమితం సరిగా ఉండదు. ఇక సాయితేజ తమ ఇంటి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెకు ఇంట్లో ఉన్న డబ్బు, నగలు బహుమతిగా ఇవ్వాలని భావించాడు. ఇందుకు పెంచిన తల్లి భూదేవి అడ్డుగా ఉందని అనుకున్నాడు. స్నేహితుడైన నర్సింహ అనే వ్యక్తికి తన ప్లాన్ వివరించాడు. అతడిని ఈ నెల 6వ తేదీన ఇంటికి రప్పించాడు. నిద్రిస్తున్న భూదేవిని చంపి, ఇంట్లో ఉన్న 10 లక్షల నగదు, 30 తులాల బంగారం తీసుకుని పరారయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ అమ్రాబాద్‌లోని అడవుల్లోకి వెళ్లిపోయారు. ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలో డబ్బు, బంగారంపై కన్నేసిన నర్సింహ తన స్నేహితుడు సాయితేజను హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి అక్కడ చెరువులో పడేశాడు. ఆ తర్వాత మత్తు దిగడంతో హైదరాబాద్ వచ్చి, గురువారం సరూర్ నగర్ పోలీసుల వద్ద లొంగిపోయాడు.