సాధారణంగా జలుబు లాంటి లక్షణాలను కలిగి ఉండే ఓ వైరస్ చిన్నారుల ప్రాణాలను హరిస్తోంది. ది లాన్సెట్ జర్నల్‌లో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం, సాధారణంగా జలుబు లాంటి లక్షణాలను కలిగించే ఒక సాధారణ వైరస్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో లక్షకు పైగా మరణాలకు కారణమైందని తెలుస్తోంది. కోల్డ్ వైరస్‌గా శాస్త్రవేత్తలు పిలిచే శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్‌వీ) కారణంగా 36 లక్షలు మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారు. వారిలో ఆరోగ్యం విషమించి 1,01,400 మంది మరణించినట్లు అధ్యయనం వెల్లడించింది.
ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులలో 2019లో 45 వేల మరణాలు సంభవించాయని అధ్యయనం నివేదించింది. చైనాలో ఈ వైరస్ 2019లో తొలిసారి వెలుగు చూసిందని అధ్యయనం చేసిన యూకేలోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన సహ రచయిత హరీష్ నాయర్ చెప్పారు. అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి ఆరు నెలలలోపు చిన్నారులు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నట్లు తేలింది.