తల్లి మరణాన్ని ఆమె కుమార్తె తట్టుకోలేకపోయింది. తల్లి చనిపోయి 10 రోజులు గడిచినా ఎవరికీ విషయం చెప్పలేదు. చివరికి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తనిఖీలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్‌లో సునీత దీక్షిత్ అనే మహిళ తన కుమార్తె అంకిత దీక్షిత్ (26) వద్ద నివసిస్తోంది. సునీత దీక్షిత్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో ఇంజినీర్‌గా పని చేసి రిటైర్ అయింది. ఆమె సుమారు 10 రోజుల క్రితమే మరణించగా, ఈ విషయాన్ని కుమార్తె అంకిత ఎవరికీ తెలియజేయలేదు.
స్థానికుల సమాచారంతో శుక్రవారం తాము వెళ్లి పరిశీలించగా లోపలికి అంకిత తమను రానివ్వలేదని డీసీపీ ప్రాచీ సింగ్ తెలిపారు. ఆ తర్వాత తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లామని చెప్పారు. మూసి ఉన్న గదిలో నుంచి దుర్వాసన వచ్చిందని, తలుపు తెరవగానే మృతి చెందిన సునీత దీక్షిత్‌ను గమనించామన్నారు. మరో గదిలో మానసికంగా క్రుంగిపోయిన అంకిత దీక్షిత్‌ను చూశామని చెప్పారు. తల్లి చనిపోవడంతో అంకిత మానసిక స్థితి బాగోలేదని, అందుకే అలా ప్రవర్తించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించామని, రిపోర్టు వచ్చాక ఆమెది సహజ మరణమా, హత్యా అనే విషయం వెల్లడవుతుందన్నారు.