కోవిడ్ మహమ్మారి దేశంలో క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్తగా నమోదయ్యే రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్తగా నమోదయ్యే కేసుల కంటే మహమ్మారి బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం సానుుకూలాంశం. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేల కంటే దిగువున పడిపోవడం శుభపరిణామమని చెప్పొచ్చు. రోజువారీ మరణాల సంఖ్య కూడా కొన్ని రోజులుగా 30లోపే నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత 24 గంటల వ్యవధిలో 4,99,382 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,323 కొత్తగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 25 మంది కోవిడ్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి మొత్తం కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 5,24,348కు చేరింది. శుక్రవారం 2,346 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 14,996కు తగ్గింది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15,32,383 డోసుల టీకాలను పంపిణీ చేశారు.