నిజం నిప్పులాంటిది అని ఊరికే అనలేదు మన పెద్దలు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా నిజం చెప్పడమే ఉత్తమం. తాత్కాలిక ప్రయోజనాల కోసం అబద్దంమాడితే అది అసలుకే ఎసరు తెస్తుంది. అలాంటి ఘటనయే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ లో చోటు చేసుకొంది. బట్టతల ఉందన్న వాస్తవం దాయడం కారణంగా ఏకంగా ఓ పెళ్ళి పీటవద్దకు వచ్చి ఆగిపోయింది.
పెళ్లి వేడుకలో అమ్మాయి, అబ్బాయి తరఫు బంధువులు అందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు. కాసేపట్లో తన పెళ్లి అయిపోతుందని పెళ్లి కొడుకు సంబరపడిపోతున్నాడు. అయితే, జయమాల వేడుక అనంతరం పెళ్లికొడుకు అలసిపోయి స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతడిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి, తలపాగా తీయబోయాడు.
అదే సమయంలో వరుడి విగ్గు ఊడిపోయింది. పెళ్లి కూతురు బంధువులు అందరూ షాకయ్యారు. పెళ్లి కొడుకుకి బట్టతల ఉందని తమకు ముందుగా ఎందుకు చెప్పలేదని, ఇంత మోసం చేస్తారా? అంటూ నిలదీశారు. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని పెళ్లికూతురు స్పష్టం చేసింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే పెళ్లి వేడుక వద్దకు వచ్చారు. ఇరు కుటుంబాలను సముదాయించి, గొడవను ఆపారు. చివరి నిమిషంలో పెళ్లి రద్దు కావడంతో వరుడు తీవ్ర నిరాశ చెందాడు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.