టీడీపీ విజయం సాధిస్తుందనే విశ్వాసం, ధైర్యం ఉంటే సార్వత్రిక ఎన్నికల దాకా ఎందుకు.. ఆత్మకూరు ఉపఎన్నికలో పోటీచేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ‘ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేయకుంటే.. మీతో సహా మిమ్మల్ని ఛీకొట్టగా మిగిలిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచే దమ్ముందా?’ అని నిలదీశారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ........ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, అందులో ఏదేదో మాట్లాడి, మీ రెండు పత్రికల్లో వేయించి, మళ్లీ దానిపై టీవీల్లో చర్చలు పెట్టించి.. మీరు స్వయంతృప్తి చెందడం ఎందుకు? చంద్రబాబు కబ్జా చేసిన టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయింది. ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు, సానుభూతిపరులు మహానాడుకు వస్తే.. ఎన్నికల్లో విజయం సాధించేసినట్లుగా.. ఈ విజయం కార్యకర్తలకే అంకితం అని చంద్రబాబు చెప్పడం.. దాన్నే ‘ఈనాడు’ అచ్చేయడం విడ్డూరం అని అన్నారు.