తూర్పు గోదావరి: తాళ్లరేవు మండలం చొల్లంగి గొడౌన్ల వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గౌతమ్ కుమార్ షా(24) అనే వ్యక్తి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కోరంగి ఎస్సై టి. శివకు మార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు బీహార్ లోని ఖగాడియా జిల్లా చైదా గ్రామానికి చెందిన సుమారు 25 మంది కార్మికులు కూలిపని నిమిత్తం ఇటీవల కాకినాడ వచ్చారు. వారు దుమ్ములపేటలో అద్దెకు నివాసం ఉంటూ పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ మంగళవారం చొల్లంగి హైవే ప్రక్కన ఉన్న లోటస్ కంపెనీకి సంబంధించిన గొడౌన్ వద్ద రైసు బ్యాగులను అన్ లోడు చేస్తుండగా లారీ డ్రైవర్ అజాగ్రత్తగా లారీ నడపడంతో గౌతమ్ కుమార్ షా ఎడమకాలుపై నుంచి వెళ్లి తీవ్ర గాయమైంది. స్థానికులు హుటాహుటిన 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సహ కార్మికుడు రాజేష్ కుమార్ పాశ్వాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలియజేశారు.