ఆత్మకూరు: పూజల పేరుతో ఓ తండ్రి చేసిన పని కుమార్తె ప్రాణాల మీదికొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పేరారెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్ ఇంట్లో బుధవారం పూజలు చేశారు.ఇందులో భాగంగా తన కుమార్తె పునర్విక(3)ను పూజ గదిలో పడుకోబెట్టి నోటి నిండా కుంకుమ కుక్కాడు. బాలిక భయంతో అరుస్తూ లేచి వెళ్లేందుకు ప్రయత్నించగా గొంతు పట్టుకొని గట్టిగా నొక్కాడు. బాలిక అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను ఆత్మకూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పునర్విక అపస్మారక స్థితికి చేరుకుంది.పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నెల్లూరు తరలించారు. కొన్ని రోజులుగా వేణుగోపాల్ మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్మకూరు ఎస్సై శివశంకర్ తెలిపారు.