ఢిల్లీ రాజు అయన ఓ అమ్మకు కొడుకే. అది సామాన్యుడైనా దేశాన్ని పాలించే రాజు అయిన సరే. ఇక్కడ కూడా మన దేశ ప్రధాని తన అమ్మకు ఓ కొడుకుగానే కనిపించారు. ప్రధాని మోదీ తన అమ్మ హీరాబెన్ మోదీ శతవత్సర పుట్టిన వేడుక (శనివారం) సందర్భంగా తన మనసులోని భావాలను ఆవిష్కరించారు. అమ్మ గురించి తన మనుసులోని మాటలను బయటపెట్టారు. తన కోసం ఆమె ఎంత చేసిందీ, తన వ్యక్తిత్వంపై ఆమె ప్రభావాన్ని బ్లాగులో వివరించారు.
‘‘మా.. అన్నది ఒక పదం కాదు. ఎన్నో భావోద్వేగాల సంగ్రహం. నేడు జూన్ 18న అమ్మ హీరాబ 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఆనందంతో కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని నా ఆలోచనలను రాస్తున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తన అమ్మ సాధారణంగానే కనిపించినా.. ఒక అసాధారణ మహిళగా పేర్కొన్నారు. ‘‘చాలా చిన్న వయసులోనే మా అమ్మ, తన అమ్మను కోల్పోయింది. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది. అయినా మరింత బలంగా నిలబడింది’’ అని చెప్పారు. తాను ఎదుగుతున్న కొద్దీ అమ్మ తన కోసం ఎన్నో త్యాగాలు చేసినట్టు తెలిపారు. తన వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, మనసును అమ్మ ఎంతో ప్రభావితం చేసినట్టు చెప్పారు.
గుజరాత్ లోని వద్ నగర్ లో మట్టిగోడలతో కూడిన పెంకుటిల్లులో తన తల్లిదండ్రులు, సోదరులతో కలసి ఉన్న నాటి జ్ఞాపకాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. అమ్మ ఇంట్లో అన్ని పనులు తాను ఒక్కతే చేయడమే కాకుండా.. ఇంటి పోషణ కోసం కూడా తనవంతు కష్టపడేదని ప్రధాని వివరించారు. కొందరి ఇళ్లల్లో వంటపాత్రలు కడిగేదని, చరఖా తిప్పడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబ ఖర్చులకు మద్దతుగా నిలిచేదన్నారు.
‘‘వర్షం పడినప్పుడు మా ఇంటి పైకప్పు నుంచి నీరు కిందకు పడేది. అప్పుడు అమ్మ బకెట్లు, పాత్రలను నీరు కారే చోట పెట్టేది. ఎంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మ దృఢంగా నిలిచింది’’ అని ప్రధాని తన చిన్న నాటి గుర్తులను పంచుకున్నారు. పాఠశాలకు వెళ్లకుండానే చదువుకోవాలన్న విషయాన్ని తాను గ్రహించేలా అమ్మ చేసినట్టు చెప్పారు. అమ్మ ఆలోచనా విధానం, భవిష్యత్తు గురించి ముందు చూపు తనను ఎంతో ఆశ్చర్యపరిచేదన్నారు.
సామాన్య జీవితానికి అమ్మ ఇచ్చే ప్రాధాన్యతను సైతం ప్రధాని మోదీ వివరించారు. అమ్మ పేరిట ఎటువంటి ఆస్తులు లేవన్నారు. ‘‘బంగారం ఆభరణాలను ఆమె ధరించడం నేను చూడలేదు. ఆమెకు ఆసక్తి కూడా లేదు. గతంలో మాదిరే అతి సాధారణ జీవితాన్ని చిన్న గదిలో కొనసాగిస్తున్నారు’’ అని మోదీ వివరించారు.
కేవలం రెండు సందర్భాల్లోనే అమ్మ తనను వెంట పెట్టుకుని బయటకు వచ్చినట్టు ప్రధాని మోదీ చెప్పారు. మొదట అహ్మదాబాద్ లో ఒక కార్యక్రమానికి తీసుకెళ్లినట్టు తెలిపారు. శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో ఏక్తా యాత్ర ముగింపు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. అహ్మదాబాద్ లో జరిగిన బహిరంగ కార్యక్రమానికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. 2001లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తన వెంట అమ్మ ఉన్నట్టు చెప్పారు. ఇలా చాలా విషయాలను ప్రధాని ఈ బ్లాగులో https://www.narendramodi.in/mother-562570 పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa