జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని త్వరితగతిన న్యాయం పొందాలని అనంతపురం జిల్లా జడ్జి జి.శ్రీనివాస్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఈనెల 26 న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంపై చర్చించారు. లోక్ అదాలత్ లో ఉభయులూ రాజీపడ తగిన క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ తగాదాలు, మోటార్ యాక్సిడెంట్ పరిహార కేసులు, వర్క్ మెన్ కంపెన్షన్ కేసులు, కుటుంబ తగాదాలు, లేబర్ కోర్టు కేసులు, చిట్ ఫండ్ కంపెనీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతూ తమ కేసుల పరిష్కారం విషయంలో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీనబాబు పాల్గొన్నారు.