మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఆసక్తికరంగా మలుపులు తీసుకుంటోంది. ఒకపక్క శివసేనకు చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే అసోంలోని గువాహటిలో తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలతో (సుమారు 40కుపైగా) క్యాంప్ ఏర్పాటు చేసుకోగా.. మరోవైపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మహారాష్ట్ర వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణం సమాలోచనల్లో మునిగిపోయింది. ఇదిలావుంటే సీఎం కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య థాకరే తన ట్విట్టర్ పేజీ బయో నుంచి మహారాష్ట్ర పర్యావరణ మంత్రి అనే హోదాను డిలీట్ చేశారు. ఇది కూడా ప్రభుత్వం పతనం దిశగా సందేహాలకు తావిస్తోంది.
రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కరోనాతో ఆసుపత్రిలో చేరగా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు నిర్వహించిన యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ గా తేలింది. దీంతో ఆర్టీపీసీఆర్ కోసం రక్త నమూనా పంపించారు. ఆ ఫలితం రావాల్సి ఉంది. తాజా పరిణామాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశానికి సీఎం ఉద్ధవ్ వర్చువల్ గా హాజరయ్యారు. శివసేనకు ఉన్న 55 మంది ఎమ్మెల్యేల్లో 40కు పైగా షిండే పక్షాన చేరిపోవడంతో సీఎం పదవికి థాకరే రాజీనామా చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
తనకు మద్దతు ఇస్తున్న 46 మంది ఎమ్మెల్యేల్లో శివసేన నుంచి 37 కంటే ఎక్కువే ఉన్నట్టు ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురికాకుండా ఉండేందుకు కనీసం 37 మంది ఎమ్మెల్యేలను చీల్చాల్సి ఉంటుంది. ఇదిలావుంటే మరోవైపు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. "థాకరే ప్రభుత్వం పేక ముక్కలా కూలిపోతుందని బీజేపీ భావిస్తుండొచ్చు. కానీ, శివసేన బూడిద నుంచి మళ్లీ మళ్లీ ఎగసిపడుతుంది. శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే ఈ రోజు సాయంత్రం భేటీ కానున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ శివసేనతోనే ఉన్నాయి’’ అని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు ప్రతిపాదన ఇప్పటికైతే లేదని, తాను సీఎం ఉద్ధవ్ థాకరేతో మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఇన్ చార్జ్ కమల్ నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం ముంబైలో నేడు ఒక సమావేశం నిర్వహించింది. ఎంవీఏకే కాంగ్రెస్ మద్దతు ఉంటుందని కమల్ నాథ్ స్పష్టం చేశారు.