సమయస్పూర్తితో చేపట్టే పనులు కొన్ని మనల్నీ హీరోలుగా నిలుపుతాయి. ఓ డెలవరీ బాయ్ సమయస్పూర్తి అలాంటిదే మరి. చిన్న సాయం పెద్ద పెద్ద ప్రమాదాలను తప్పిస్తోంది. కొన్నిసార్లు ప్రాణాలను నిలబెడుతుంది. ఇలాగే ఓ వ్యక్తి చేసిన పని.. చిన్నారిని పెను ముప్పు నుంచి తప్పించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. వసంత్ విహార్ మున్సిపల్ స్కూల్లో శుక్రవారం ఉదయం గేటు దగ్గర 12 ఏళ్ల అమ్మాయి ఆడుకుంటుండగా పొరపాటున గేటు ఇనుప ముక్క ఆమె చెంపలో గుచ్చుకుపోయింది. ఆ బాధతో ఆ అమ్మాయి అరిచింది.
స్కూల్ వాచ్‌మెన్‌కు, అటు వైపుగా బైక్‌పై వెళ్తున్న అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ రవి భండారీకి బాలిక అరుపులు వినిపించాయి. వెంటనే బాలిక దగ్గరకు వెళ్లారు. ఆమె చెంపలో ఇనుప ముక్క గుచ్చుకోవడం చూసిన వారు.. కదిలితే మరింత లోతుగా గాయమయ్యే అవకాశం ఉందని గుర్తించారు. రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించారు. దగ్గర్లోని ఆస్పత్రి వర్గాలను సంప్రదించి.. పరిస్థితి వివరించి చెప్పారు. దాంతో వసంత్ విహార్ దగ్గర్లోని ఆస్పత్రి నుంచి ఓ డాక్టర్, నర్స్ వచ్చారు. వారు జాగ్రత్తగా గేట్ ఇనుప భాగాన్ని కత్తిరించి ఆమెను రక్షించారు. తర్వాత తల్లిదండ్రులకు విషయం తెలియజేసి.. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలిక పాఠశాలకు వెళ్తుంది.
రవి తన బైక్‌ను ఆపి చిన్నారికి సాయం చేసిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. డెలివరీ బాయ్ సహాయం చేయకపోతే, అమ్మాయి కంటికి కూడా గాయం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా సరైన సమయంలో చికిత్స అందించడంతో బాలిక కోలుకుంది. ఈ సంఘటనను ప్రతీక్ సలుంకే అనే యూజర్ ట్విట్టర్ పోస్ట్‌లో తెలియజేశారు.
అంతేకాదు డెలివరీ బాయ్ రవి ఇంతటి సహాయం చేసినందుకు అమెజాన్ ఇండియాను అభినందించాలని ప్రతీక్ కోరారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. రవి ప్రదర్శించిన మానవత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అతనికి బహుమతి ఇవ్వాలని చాలా మంది అమెజాన్‌ను కోరారు. కాగా ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతర కొరియర్ సర్వీస్ బాయ్స్ మానవత్వాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. అనేక సందర్భాల్లో వారు ఆపదలో ఉన్నవారికి సాయం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.