కరోనా వైరస్ వివిధ రూపాల్లో ఇంకా తన ప్రభావం చూపుతూనే ఉంది. తాజాగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ4, బీఏ5 మహారాష్ట్రలో అలజడి రేపుతున్నాయి. రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 73కు చేరుకుందని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులన్నీ పుణే జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఈ జిల్లాలో గడిచిన రెండు వారాల్లో కొవిడ్ కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల చోటు చేసుకుంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. బీఏ .4, బీఏ.5 వేరియంట్ల కారణంగా బ్రిటన్‌లో మరో కొవిడ్ వేవ్ కొనసాగుతోంది. అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం జనం ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోనూ ఈ తరహా వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర పరిణామమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 బారిన పడ్డ వారందరిలో లక్షణాలేవీ లేవని.. అందరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉండి, కోలుకుంటున్నారని అధికారుల తెలిపారు. థానే, నాగపూర్, పాల్గార్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో ఇటీవల కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వైద్య అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.