కోల్పోవడానికి ఏమీ మిగలనప్పుడు.. ఇక అంతా లాభపడడమే అని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా చేసిన ఓ ట్వీట్ తీవ్ర చర్చాంశనీయమైంది. కోల్పోవడానికి ఏమీ మిగలనప్పుడు.. ఇక అంతా లాభపడడమే అంటూ ఆయన ట్వీట్ చేశారు. జై మహారాష్ట్ర అని కూడా అన్నారు. శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 40 మందిని తనవైపునకు తిప్పుకున్న ఏక్ నాథ్ షిండే బీజేపీ మద్దతుతో ఏకంగా సీఎం పదవిని అలంకరించడం తెలిసిందే. ఇక శివసేనకు పార్టీ చీఫ్ సహా మిగిలింది 15 మందే.
దీంతో షిండే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడాన్ని శివసేన సుప్రీంకోర్టు ముందు సవాల్ చేసింది. శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ ఇలా ట్వీట్ చేశారు. అంటే ‘పోరాడితే పోయేదేముంది’ అన్న విధానం ఆయన మాటల్లో కనిపిస్తోంది. న్యాయపరమైన చర్యలతో షిండే సర్కారును ఇరుకున పెట్టే వ్యూహాన్ని ఎంచుకున్నట్టుంది. శివసేనలో మాట్లాడే స్వరం ఏదైనా ఉందంటే అది సంజయ్ రౌత్ అనే చెప్పుకోవాలి. పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే మాట్లాడడం తక్కువే.