ఇతరుల అనుభవాలు సైతం మనకు పాఠాలు నేర్పుతాయి. దానిని చూసైనా మనం మారాలి. లేకపోతే మనం కూడా ఇతరుల మాదిరే బాధితులం కావాల్సివస్తుంది. ముంబైకి చెందిన వైష్ణవి అనే మహిళ తమ ఇంట్లో వేడుకకు ఓ కేక్ తెప్పించాలనుకుంది. జొమాటోలో ఓ మంచి బేకరీ చూసుకుని కేక్ ను ఆర్డర్ చేసింది. అయితే ఆన్ లైన్ పేమెంట్ కాకుండా.. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకుంది. తన దగ్గర సరిపోయినంత చిల్లర లేకపోవడంతో.. రూ.500కు చిల్లర తీసుకురండి (బ్రింగ్ 500 చేంజ్) అంటూ యాప్ లో డెలివరీ బాయ్ కు ఇన్ స్ట్రక్షన్ పెట్టింది.
ఇంతదాకా బాగానే ఉంది. కానీ డెలివరీ బాయ్ కు పెట్టిన ఈ ఇన్ స్ట్రక్షన్ ను కేక్ పై రాయడానికి పెట్టారేమోనని బేకరీ సిబ్బంది భావించారు. కేక్ పై ‘బ్రింగ్ 500 చేంజ్’ అని ఇంగ్లిష్ లో రాసిపెట్టి పంపారు. తీరా ఇంటికి వచ్చాక చూసుకుంటే.. కేక్ పై రాసి ఉన్నదాన్ని చూసి వైష్ణవి అవాక్కయింది. ఏదో అంటే ఏదో అయిందంటూ కేక్ ఫొటోతో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది.
కేక్ ఫొటోతో వైష్ణవి పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ‘హ్యాపీ బర్త్ డే బ్రింగ్ 500 చేంజ్’ అంటూ కొందరు, ‘అందుకే ఆన్ లైన్ లో డబ్బులు పే చేయాలనేది’ అంటూ ఇంకొందరు కామెంట్లు పెట్టారు.
ఇక ‘డెలివరీ ఇన్ స్ట్రక్షన్ ఇచ్చారుగా. ఇంకే అలాగే వచ్చింది’, ‘వాళ్లు కావాలనే ఇలా చేస్తుంటారని అనిపిస్తోంది’, ‘కుకింగ్ ఇన్ స్ట్రక్షన్స్ లో రాశారేమో..’ ‘ఇంకా నయం.. ఏమేమో రాయలేదు..’ అని మరికొందరు కామెంట్లు పెట్టారు.
ఇంతకుముందు మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ఒకాయన కూడా ఇలాగే కేక్ కోసం స్విగ్గీలో ఆర్డర్ చేశారు. కేక్ లో గుడ్డు కలిపారా, లేదా అన్న విషయాన్ని చెప్పాలని ఇన్ స్ట్రక్షన్ ఇచ్చాడు. కానీ కేక్ ఇంటికి వచ్చాక చూసుకుంటే తలతిరిగి పోయింది. ఎందుకంటే.. కేక్ లో గుడ్డు కలిసి ఉంటుందని చెబుతూ.. కేక్ పైనే ‘కంటైన్ ఎగ్’ అని రాసి పంపారు మరి. అది కూడా విపరీతంగా వైరల్ అయింది.