యూపీ, బిహార్ రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ఘటనల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతి చెందగా.. మరో 16 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.రిలీఫ్ కమిషనర్ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం.. పిడుగుపాటు కారణంగా బండాలో నలుగురు, ఫతేపూర్‌లో ఇద్దరు, బల్రాంపూర్, చందౌలీ, బులంద్‌షహర్, రాయ్ బరేలీ, అమేథి, కౌశాంబి, సుల్తాన్‌పూర్ మరి, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. పిడుగుపాటు గురై చనిపోయిన వారికి సీఎం ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.4 లక్షల చొప్పున అందించాలని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించినట్లు ఓ ప్రకటన తెలిపింది. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మరోవైపు బిహార్‌లో పిడుగుపాటుకు గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటు కారణంగా ఐదుగురు మృతి చెందడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని 5 జిల్లాల్లో పిడుగుపాటుకు 5 మంది మృతి చెందడం బాధాకరమని, మృతులపై ఆధారపడిన వారికి తక్షణమే రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తామని, జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం.. సివాన్‌లో ఒకరు, సమస్తిపూర్‌లో 1, గయాలో 1, ఖగారియాలో 1, సరన్‌లో 1 పిడుగుపాటు కారణంగా మరణించారు. ఇదిలా ఉండగా.. జులై 20 , 21 తేదీలలో ఒడిశా, బిహార్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది.