విద్యాసంస్కరణల పేరుతో వైసీపీ సర్కారు అమలు చేస్తోన్న 117 జీవో టీచర్లపై కక్ష సాధించేలా ఉంది. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం సర్కారు జారీచేసిన జీవోలు 117, 128, 84, 85లతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది అని టీడీపీ నాయకులూ నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పాఠశాలల విలీనంతో నిరుపేద పిల్లలు విద్యకి పూర్తిగా దూరమై బాలకార్మికులుగా మారే ప్రమాదం ఉంది. సీపీఎస్ రద్దు, తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడిన ఉపాధ్యాయులపై కక్ష సాధించేందుకు నూతన విద్యావిధానాన్ని జగన్రెడ్డి సర్కారు ఒక ఆయుధంగా వాడుతుంది.
వారానికి 24 నుండి 30 పీరియడ్లు మాత్రమే చెప్పగలిగిన ఉపాధ్యాయులు వైసీపీ సర్కారు తెచ్చిన జీవో ప్రకారం వారానికి 40 నుండి 48 పీరియడ్లు పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొత్తగా అమలు చేస్తోన్న విద్యావిధానంలో అనేక హైస్కూళ్లలో హెడ్మాస్టర్, పీఈటీ, సబ్జెక్ట్ టీచర్లు ఉండరు.
ప్రభుత్వ విద్యావ్యవస్థని అస్తవ్యస్తం చేసి, ప్రైవేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా వున్న 117, 128, 84, 85జీవోలు వెనక్కి తీసుకోవాలి. ఉద్యమిస్తున్న ఉపాధ్యాయ సంఘాలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని హామీ ఇచ్చారు.