ఇరాన్ లో శిక్షలు ఎంత కఠినమో అక్కడి మరణశిక్షల అమలు తీరును చూస్తేనే అర్థమవుతుంది. మహిళలకు సైతం మరణ శిక్షలను అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఈ శిక్షలపై ఆందోళన, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇరాన్ తగ్గడం లేదు. తాజాగా ఈ నెల 27న మరో ముగ్గురు మహిళలను ఉరితీసి మరణశిక్ష అమలు చేశారు. వీరు ముగ్గురు చేసిన నేరం ఏమిటంటే... వీరందరూ వారి భర్తలను చంపేశారు.
చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడం, మహిళలకు హక్కులు లేకపోవడం మహిళల పాలిట శాపంగా పరిణమించాయి. పెళ్లయ్యాక గృహ హింసను ఎదుర్కొన్నప్పటికీ విడాకులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో... బాధిత మహిళలు భర్తలను హత్య చేస్తున్నారు. భర్తలను చంపుతున్న ఘటనల్లోనే వీరికి ఎక్కువగా మరణశిక్షలు పడుతున్నాయి. మరోవైపు, ఇరాన్ చట్టాలు మహిళల హక్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదని... మహిళలకు వ్యతిరేకంగానే చట్టాలు ఉన్నాయని మానవహక్కుల కార్యకర్తలు చెపుతున్నారు.