జనం మదిలో చోటు సాధించాలంటే ఏదైనా ప్రత్యేక పని చేయాలి. టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏది చేసినా ప్రత్యేకమే. తన నియోజకవర్గ ప్రజల కోసం ఆయన ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతుంటారు. తాజాగా ఆయనకు టీడీపీకే చెందిన తూర్పు గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే వీవీ శివరామ రాజు కూడా తోడయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలూ కలిసి పశువులకు గ్రాసం సేకరణలో భాగంగా పచ్చి గడ్డి కోతల్లో మునిగిపోయారు. తమ అనుచరులు, స్థానిక రైతులతో కలిసి ఇద్దరు నేతలు హుషారుగా పచ్చి గడ్డి కోసి... గడ్డి మోపులను నెత్తికెత్తుకుని మరీ ముందుకు సాగారు.
ఇటీవలి వరదలకు గోదావరి పరీవాహ ప్రాంతంలోని పాలకొల్లు నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నిమ్మల... ఆ తర్వాత ఆయా గ్రామాల్లో పశువులకు గ్రాసం సేకరణపై దృష్టి సారించారు. ఉండి పరిధిలో పచ్చి గడ్డి ఉందని గ్రహించిన ఆయన పాలకొల్లు ముంపు ప్రాంతాల్లోని పశువులకు గ్రాసం పంపాలని రామరాజును కోరారు. నిమ్మల కోరిక మేరకు ట్రాక్టర్ల నిండా పశుగ్రాసాన్ని రాజరాజు పాలకొల్లుకు పంపారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఉండి పరిధిలో పచ్చి గడ్డి కోతల్లో పాలుపంచుకున్నారు. ఈ వీడియోను రామానాయుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.