మాటల్లో చెప్పలేనంత స్ఫూర్తికి ఇది నిదర్శనం అంటూ కేరళకు చెందిన ఓ మహిళ లైబ్రేరియన్ పై ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద మహీంద్రా ప్రశంసలు కురిపించారు. కేరళకు చెందిన ఓ మహిళా లైబ్రేరియన్ గొప్పతనాన్ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లకు పరిచయం చేశారు. కేరళకు చెందిన 63 ఏళ్ల వాకింగ్ లైబ్రేరియన్ రాధామణి గురించి ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. ఆమెకు సంబంధించి రెండున్నర నిమిషాల వ్యవధితో కూడిన వీడియో పెట్టారు.
కేరళ రాష్ట్రం వేనాడ్ జిల్లాకు చెందిన రాధామణి మోతక్కర గ్రామ లైబ్రేరియన్. చిన్ననాటి నుంచి ఆమెకు చదవడం ఎంతో ఇష్టం. అందుకే లైబ్రేరియన్ వృత్తిని చేపట్టారు. ప్రతి రోజూ ఆమె కొన్ని కిలోమీటర్ల పాటు నడిచి చదువరుల దగ్గరకే వెళ్లి పుస్తకాలు ఇస్తుంటారు. చదివిన తర్వాత వాటిని తీసుకుని, కొత్తవి ఇవ్వడం ఆమె దినచర్యలో భాగం.
ఇలా ఒక నెలలో 500 పుస్తకాలను చదువరులకు అందిస్తుంటారు. కాకపోతే ఒక్కో పుస్తకానికి రూ.5 చార్జీగా తీసుకుంటారు. ద బెటర్ ఇండియా అనే సంస్థ రాధామణి గురించి ట్విట్టర్లో ప్రస్తావించగా, ఆనంద్ మహీంద్రా దాన్ని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
‘‘మాటల్లో చెప్పలేనంత స్ఫూర్తికి ఇది నిదర్శనం. కేరళ అత్యధిక అక్షరాస్యత రాష్ట్రంగా ఎందుకు ఉందో ఇప్పుడు తెలుస్తుంది. 63 ఏళ్ల వయసులో ఆమె చొరవ, సహకారాన్ని ప్రశంసించాల్సిందే. డివైజ్ లు ఆధిపత్యం చేస్తున్న రోజుల్లో చదవడం పట్ల ఉన్న అంకిత భావం ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.