వ్యవసాయ పరిశోధనకు కేంద్రం అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ పరిశోధనలకు కేటాయింపులను ఎందుకు పెంచడంలేదని నిలదీశారు. 2021-22లో వ్యవసాయ పరిశోధనకు రూ.8,514 కోట్లు కేటాయించారని, 2022-23లోనూ అంతేమొత్తం కేటాయించారు తప్ప, అదనపు కేటాయింపులు లేవని విమర్శించారు.
ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగం తీవ్రనష్టాల పాలవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మనుగడ సాగించగలిగే విత్తనాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని విజయసాయి అభిప్రాయపడ్డారు. అందుకోసం వ్యవసాయ పరిశోధనకు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిని వివరణ కోరారు.
ఇదిలావుంటే విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాస్ చౌదరి బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో వ్యవసాయ పరిశోధనకు ప్రముఖ స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ఐసీఏఆర్ (భారత వ్యవసాయ పరిశోధన మండలి) కోరితే నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. దేశంలో వ్యవసాయ పరిశోధన ముందంజ వేసిందని, కొత్తగా 1,957 విత్తనాలను అభివృద్ధి చేశారని, వాతావరణ మార్పులను తట్టుకోగల 286 కొత్త విత్తన రకాలను కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని మంత్రి కైలాస్ చౌదరి వివరించారు. వ్యవసాయ పరిశోధనను కేంద్రం విస్మరించబోదని తెలిపారు.