రెండు పరస్పర విరుద్ద నేతలు భేటీ అయితే దానికి ఏదో ఒక ప్రధాన్యత ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. దీదీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తూ టీచర్ల నియామకానికి సంబంధించిన కుంభకోణంలో అరెస్టయిన పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం పార్థ చటర్జీకి రెండు వారాల పాటు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానితో దీదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ వర్సెస్ బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయానికి ముందు కూడా ప్రధానితో దీదీ భేటీ అయ్యారు. తాజాగా ప్రధానితో మమత భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.